కర్ణాటక పొలిటికల్ థియరీ: నాలుగు రాష్ర్టాలు అప్లై

కర్ణాటక పొలిటికల్ థియరీ ఇప్పుడు నాలుగు రాష్ర్టాలను తాకింది. కన్నడ పరిణామాలను చూపిస్తూ గోవా, బీహార్, మణిపూర్, మేఘాలయ రాష్ర్టాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తాము అర్హులంటూ కాంగ్రెస్‌, ఆర్జేడీ పార్టీలు ముందుకొచ్చాయి. ఈ వ్యవహారంపై శుక్రవారం ఆయా రాష్ర్టాల గవర్నర్‌లను కలిసేందుకు సిద్ధమవుతున్నారు అక్కడి ప్రతిపక్ష పార్టీల నేతలు. ఇటు ఈ వ్యవహారంపై దేశవ్యాప్తంగా శుక్రవారం ఆందోళనలకు సిద్ధమైంది కాంగ్రెస్ పార్టీ.

గతేడాది మార్చిలో గోవా అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. 40 నియోజకవర్గాలున్న గోవాలో కాంగ్రెస్‌- 17 స్థానాల్లో గెలిచింది. బీజేపీ -13 సీట్లను దక్కించుకుంది. ఐతే, ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో ఇతరపార్టీలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని బీజేపీ ముందుకొచ్చింది. అదే సమయంలో కాంగ్రెస్‌ నుంచి ఓ ఎమ్మెల్యే బీజేపీలోకి చేరడంతో కాంగ్రెస్ బలం 16కి తగ్గింది. దీంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని గవర్నర్‌ మృదులాసిన్హా బీజేపీని ఆహ్వానించడం, మనోహర్‌ పారికర్‌ సీఎం కావడం జరిగిపోయింది. గోవాలో అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్‌, చివరకు ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది.

మరోవైపు బీహార్‌లో అతిపెద్ద పార్టీగా అవతరించిన ఆర్జేడీ కూడా గవర్నర్‌ని కలిసేందుకు సిద్ధమవుతోంది. గత ఎన్నికల్లో ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జేడీయూ, తర్వాత విభేదాల కారణంగా బీజేపీతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని నడుపుతోంది. ఇప్పుడు బీహార్‌లో తమ పార్టీ అతిపెద్దదిగా అవతరించిందని, కర్ణాటక తరహాలో తమకే అవకాశం ఇవ్వాలని గవర్నర్‌ని కోరనున్నట్లు ఆర్జేడీ నేత తేజస్వియాదవ్ చెప్పారు.

ఇటు మణిపూర్‌లో కూడా శుక్రవారం గవర్నర్ అపాయింట్‌‌మెంట్ అడిగారు అక్కడి మాజీ సీఎం, ప్రతిపక్షనేత ఇబోబిసింగ్. ఇక్కడ అన్నిపార్టీల కంటే తమకే ఎక్కువ సీట్లు వచ్చాయని, అతిపెద్ద పార్టీ అవతరించిన తమను గవర్నర్ ఎందుకు ఆహ్వానించలేదు.. ఇప్పుడు కర్ణాటకలో ఎక్కువ సీట్లు గెలిచిన బీజేపీని ఎలా ఆహ్వానించారు అంటూ ప్రశ్నించారు. మేఘాలయది కూడా అదే పరిస్థితి. మొత్తానికి కర్ణాటక పొలిటికల్ థియరీ తేనెతుట్టెని కదిపింది.

READ ALSO

Related News