బాబుకు పోసాని ఛాలెంజ్!

కొరివితో తలగోక్కోవడమంటే ఇదేనేమో! ప్రత్యేక హోదా కోసం మేం కష్టపడుతుంటే.. సినిమా వాళ్ళు ఏం చేస్తున్నారు? అంటూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్ర ప్రసాద్ ఇచ్చిన స్టేట్మెంట్ ఫలితం ఏమిటి? నంది అవార్డులు రానందుకు రచ్చకెక్కినవాళ్ళు.. ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం బైటికి రాకుండా దాక్కుంటారా? అంటూ రెచ్చగొట్టిన ‘బాబు’ మీద టాలీవుడ్ రియాక్షన్ ఏమిటి? ”మావాళ్ల భార్యలు రోజుకొకరితో పడుకుంటారని ఒక పెద్దమనిషి మాట్లాడితే.. మీ రాజకీయ పార్టీలన్నీ కనీసం స్పందించలేకపోయాయి.. ఇప్పుడు నోళ్లు బాగా లేస్తున్నాయి..” అంటూ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఇప్పటికే కస్సుమన్నారు. ప్రముఖ నటుడు, రచయిత, టాలీవుడ్ ఫైర్ బ్రాండ్ పోసాని కృష్ణ మురళీ ఇంకో అడుగు ముందుకేశాడు.

”హోదా కోసం విజయవాడ నడిరోడ్డుమీద ఆమరణ దీక్ష చేస్తా.. మీరూ వస్తారా?” అంటూ తెలుగుదేశం పార్టీ నేతల్ని సవాల్ చేశారు పోసాని. నేను ప్రాణాలు వదిలెయ్యడానికి కూడా సిద్ధం.. మీలో ఎవరికైనా ఆ తెగింపు ఉందా అంటూ సూటిగా ప్రశ్నించారు. ప్రత్యేక హోదా మీద పిల్లిమొగ్గలేయడమే పనిగా పెట్టుకున్న తెలుగుదేశం పార్టీకి సినిమా వాళ్ళను విమర్శించే హక్కు లేదన్నది పోసాని ఆర్గ్యుమెంట్. టాలీవుడ్ తరఫున ఆమరణ దీక్షకు సిద్ధపడ్డానన్న పోసాని.. ఈ రకమైన నిర్ణయాన్ని ప్రకటించిన వాళ్లలో నాలుగోవారు. దీక్ష చేస్తానంటూ గుంటూరు సభలో పవన్ కళ్యాణ్ ప్రకటిస్తే.. నీతో పాటు నేనూ కూర్చుంటానంటూ క్రిటిక్ కత్తి మహేష్ ట్వీట్ చేశారు. హీరో శివాజీ అయితే ప్రాణత్యాగం కోసం ఎప్పట్నుంచో సిద్ధంగా వున్నారు. మరి.. హోదా కోసం తెలుగు సినిమా ముందుకు రాలేదన్న ‘బాబూ’ వ్యాఖ్యలో హేతుబద్ధత ఎంత?

Related News