AP and TS / Politics
షర్మిల, విజయమ్మ అలసిపోయారు!

జగన్ కుటుంబం ఇక ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండిపోతుందా? 2019 ఎన్నికల్లో వైఎస్ విజయమ్మ, షర్మిల పోటీకి, ప్రచారానికి దూరంగా జరుగుతారా ? వైసీపీ లోపలా బైటా ఇప్పుడు దీనిమీద ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. పాదయాత్రలో వున్న పార్టీ అధినేత జగన్.. ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఈ టాక్ ని మరింత లోతుల్లోకి తీసుకెళ్లాయి. ఇంతకూ తల్లి, చెల్లి రాజకీయ 'భవిష్యత్తు' మీద జగన్ ఏమన్నారు?

మానవ సంబంధాలకు, ఆత్మీయతకు, అనుబంధాలకు వైఎస్ కుటుంబంలో ఎక్కువ ప్రాధాన్యత వుంటుందంటారు.. వాళ్లకు సన్నిహితంగా వుంటున్నవారు. జగన్ కూడా అదే చెబుతున్నారు. ''మా అందరి మధ్య మాటలకు అందనంత ఆప్యాయతలుంటాయి. ఒకరికోసం ఒకరం ఏమైనా చేయగలుగుతాం.. నిజానికి అమ్మ, చెల్లి రాజకీయాల్లోకి రావాలని ఎప్పుడూ అనుకోలేదు. వాళ్లకు ఆసక్తి కూడా లేదు. నేను జైల్లో వున్నప్పుడు.. విధిలేని పరిస్థితుల్లోనే వాళ్లిద్దరూ బహిరంగ వేదికల మీదకు రావాల్సి వచ్చింది..'' అన్నారు జగన్. జరుగుతున్న కుట్రల నుంచి నన్ను కాపాడదామన్న ఉద్దేశంతోనే వాళ్లిద్దరూ బాసటగా నిలబడ్డారన్న జగన్.. రేపటిరోజున వాళ్ళు మళ్ళీ ఎన్నికలకు వెళ్లే అవకాశం లేకపోవచ్చని సూచనప్రాయంగా చెప్పారు.

గత ఎన్నికల్లో వైఎస్ విజయమ్మ విశాఖ ఎంపీ సీటుకు పోటీ చేసి ఓడిపోయారు. వైఎస్ షర్మిల రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జగన్ జైల్లో వున్నప్పుడు ఓదార్పుయాత్ర చేపట్టారు. ఒక సందర్భంలో తెలంగాణా వైసీపీ బాధ్యతల్ని చెల్లి షర్మిల చేతుల్లో పెట్టారు జగన్. ఆ తర్వాత క్రమక్రమంగా పార్టీ కార్యకలాపాల నుంచి కనుమరుగయ్యారు. దాదాపు రాజకీయాలకు దూరంగా నిలబడ్డారు. ఈ లెక్కన 2019 ఎన్నికల్లో జగన్ కి కుటుంబ సభ్యుల నుంచి మునుపటంత 'బాసట' దొరక్కపోవచ్చన్నది వైసీపీ వర్గాల అంచనా.

 

Read Also

 
Related News