India / Politics
హీరో విశాల్ సమస్యకు భన్వర్‌లాల్ సమాధానం!
ప్రతిష్టాత్మకమైన ఆర్కే నగర్ ఉపఎన్నిక బరిలో చివరకు 59 మంది అభ్యర్థులు నిలిచారు. మొత్తం 145 నామినేషన్లలో విశాల్ కృష్ణ, దీపా జయకుమార్ సహా 73 మంది నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. మిగతా వారందరి సంగతి అలావుంచితే.. హీరో విశాల్ నామినేషన్ మీదే రెండురోజులుగా విపరీతమైన రగడ జరుగుతోంది. విశాల్ ని బలపరుస్తూ నియోజకవర్గంలోని 10 మంది ఓటర్లు అఫిడవిట్లు సమర్పిస్తే.. అందులో ఇద్దరివి నకిలీవని, వాళ్ళ సంతకాలు ఫోర్జరీ చేశారని విశాల్ మీద అభియోగం నమోదైంది. ఫలితంగానే నామినేషన్ రిజెక్ట్ అయ్యింది. సుమతి, దీపన్ అనే ఆ ఇద్దరు 'సపోర్టర్ల'ను మా ముందు హాజరుపరిచి నీ అదృష్టాన్ని మళ్ళీ పరీక్షించుకోమంటూ గురువారం మధ్యాహ్నం 3 గంటల వరకు ఈసీ అధికారులు విశాల్ కి లాస్ట్ ఛాన్స్ ఇచ్చారు. కానీ.. అక్కడ కూడా ఈ హీరో గారు ఫెయిలయ్యాడు. తన నామినేషన్ మీద సంతకాలు చేసిన వాళ్ళిద్దరినీ కిడ్నాప్ చేసి బెదిరించారన్నది విశాల్ ఆరోపణ. కుట్ర జరిగిందని, ప్రజాస్వామ్యం చచ్చిపోయిందని వాపోయారు కూడా. 
తెలుగు రాష్ట్రాల మాజీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ భన్వర్ లాల్ కూడా విశాల్ సంకటం మీద సూటిగా స్పందించినట్లు ఒక వెబ్ సైట్ రాసింది. ''ఏదైనా నామినేషన్ పరిశీలన సమయంలో అభ్యర్థిని ప్రపోజ్ చేసిన పది మంది ఓటర్లనూ పిలిచి విచారించే పద్దతిని ఈసీ పాటిస్తుందా? వాళ్ళ సంతకాలు నకిలీవా ఒరిజినల్లా అని ఆరా తీసే అవకాశముందా'' అని అడిగితే.. ఆ ఛాన్సే లేదన్నారాయన. ''ఒక్కో ప్రపోజర్ నీ పిలిచి విచారించబోము'' అంటూ క్లారిటీ ఇచ్చారు భన్వర్ లాల్. అయితే.. ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థులు విశాల్ నామినేషన్ మీద ఫిర్యాదు చేసినట్లు చెప్పడం.. అనుమానాస్పదంగా మారింది. 
 
మొత్తం 145 నామినేషన్లలో 1450 మంది ప్రపోజర్స్ వుంటారు. విశాల్ కి సపోర్ట్ ఇచ్చిన టెన్ ప్రపోజర్స్ లో ఆ ఇద్దరి మీద మాత్రమే ఈసీ అధికారులకు ఎలా సందేహం వచ్చినట్లు? వాళ్లకు వాళ్లే అధికారుల దగ్గరికి వెళ్లి చెబితే తప్ప అక్కడ అనుమానం వచ్చే అవకాశం లేదు. నామినేషన్లన్నిటినీ ఈసీ వెబ్ సైట్ లో పెట్టడం వల్లే వివరాలు బైటికి పొక్కినట్లు తెలుస్తోంది. కానీ.. తన నామినేషన్ లోని ఆ ఇద్దరు సపోర్టర్స్ మీద మాత్రమే కాన్సంట్రేషన్ ఎందుకు కలిగినట్లన్న పాయింట్ మీద కుట్ర కోణం వెతుకుతోంది హీరో విశాల్ వర్గం. ఇటు.. విశాల్ పరపతి మీద కూడా డౌట్లు పడిపోతున్నాయి. మొత్తం నియోజకవర్గంలో 10 మంది నమ్మకస్తులైన ఓటర్లను కూడా దక్కించుకోలేక పోయారా అంటూ విమర్శలందుకున్నారు వ్యతిరేకులు. 
 
ఇదంతా ఒక ఎత్తయితే.. విశాల్ రేపట్నుంచి చేయబోయే ప్రచారం మీద కూడా ఆసక్తి నెలకొంది. జయలలిత సెంటిమెంట్ ఓట్ బ్యాంకులో నలుగురు వాటాదారులు. అన్నాడీఎంకే అధికారిక అభ్యర్థి మధుసూదనన్, శశికళ గ్రూప్ నుంచి రెబెల్ అభ్యర్థి దినకరన్, దీపా జయకుమార్, హీరో విశాల్ రెడ్డి. వీళ్ళలో దీపా, విశాల్ బరిలో లేనట్లే! మిగిలింది మధుసూదనన్, దినకరన్. విశాల్ స్వతహాగా జయలలిత సానుభూతిపరుడు గనుక తన సపోర్ట్ అన్నాడీఎంకే అభ్యర్థి మధుసూదనన్ కే ఉంటుందన్నది ఒక అంచనా. మరి.. విశాల్ ఎలా డిసైడ్ అవుతారో చూడాలి. ఆర్కే నగర్ బైపోల్ ఎపిసోడ్ లో హాటెస్ట్ ఎలిమెంట్ గా మారిన విశాల్ 'మాట'కు సహజంగానే వెయిట్ పెరుగుతుందన్నది ఎనలిస్టుల ఆలోచన.
 

Read Also

 
Related News