India / General
ఇంట్లో పరిస్థితులవల్లే చంపాను- రియాన్ స్కూల్ టీనేజర్!

ఢిల్లీలోని రియాన్ స్కూల్ సెకండ్ క్లాస్ స్టూడెంట్ ప్రద్యుమన్ హత్యకేసులో ప్రధాన నిందితుడైన టీనేజర్ కొత్త విషయాలు చెప్పుకొచ్చాడు. ప్రద్యుమన్‌ను ఎందుకు చంపాల్సి వచ్చింది. ఎలా చంపావ్.. హంతకుడిగా మారడానికి దారితీసిన పరిస్థితులపై సీబీఐ అధికారులు టీనేజర్ పై ప్రశ్నలు కురిపించారు. స్కూల్లో జరిగే ఇంటర్నల్ పరీక్షలు, తర్వాత జరిగే పేరెంట్స్ మీటింగ్ వాయిదా పడేందుకే ప్రద్యుమన్‌ను చంపానని 11వ తరగతి విద్యార్ధి అయిన సదరు టీనేజర్ ఒప్పుకున్నాడు. తక్కువ మార్కులు ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించిన సీబీఐ అధికారులకు దాని గురించీ టీనేజర్ సమాధానాలిచ్చాడు. తమ ఇంట్లో వాతావరణం బాగోదని, అమ్మానాన్న ఎప్పుడూ కొట్లాడుకుంటూ ఉంటారని.. అందుకే తనకు చదువు మీద ఆసక్తి తగ్గిపోయిందని టీనేజర్ ఇంటరాగేషన్ లో చెప్పాడని సీబీఐ వర్గాలు వెల్లడించాయి.

నిందితుడిపై విచారణ పూర్తి చేసిన సీబీఐ.. మళ్లీ కస్టడీ పొడిగింపు కోరలేదు. దీంతో అతడిని ఈ నెల 22 వరకు ఫరీదాబాద్ అబ్జర్వేషన్ హోమ్‌‌లో ఉంచాలని బాలల న్యాయస్థానం ఆదేశించింది. సదరు విద్యార్ధి ప్రవర్తన ఎప్పుడూ హింసాత్మకంగానే ఉండేదనీ... సెల్‌ఫోన్‌లో వీడియోలు చూస్తూ అల్లరిగా తిరిగేవాడని తోటి విద్యార్ధులు అధికారుల విచారణలో పేర్కొన్నారు. ఇదిలాఉండగా, జిల్లా బాలల భద్రతా విభాగం అధికారులు ప్రస్తుతం అతడి తల్లిదండ్రులు, పొరుగువాళ్లు, నిందితుడి ఫ్రెండ్స్‌ను కూడా కలుసుకుని విచారిస్తున్నారు. వీరి వాంగ్మూలంతో ఈ కేసులో కీలకమైన ‘సామాజిక విచారణ నివేదిక’ ను తయారుచేస్తారు.

 

Read Also

 
Related News