India / Politics
భయపెట్టడం నాకూ తెలుసంటున్న రాహుల్ గాంధీ
అతిపెద్ద లౌకికవాద జాతీయపార్టీ అంటూ దేశ రాజకీయ చరిత్రలో కాంగ్రెస్ పార్టీకి పేరుంది. ఆ పార్టీని  దశాబ్దాల పాటు బతికించింది కూడా ఆ 'సెక్యులర్' స్టాంపే! అయితే.. దేశంలో ఎక్కడైనా ఆ మాట వర్కవుట్ అవుతుందేమో గాని, గుజరాత్ లో మాత్రం కాదు. అక్కడ భక్తితోనే ఏ రాజకీయపార్టీకైనా ముక్తి. హిందూయిజం చుట్టూ తిరగడమే గుజరాత్ రాజకీయాలకున్న మాచెడ్డ అలవాటు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే గుజరాత్ లో హిందూ ఓటు బ్యాంకు పెద్దదన్న లెక్క కూడా ఒకటుంది.
అందుకే.. ఇప్పుడు కరడుగట్టిన భక్తుడి పాత్రలో జీవిస్తున్నాడు కాంగ్రెస్ ప్రిన్స్ రాహుల్ గాంధీ. 'నేను శివ భక్తుడ్ని'.. అని ఒకసారి.. 'ఐ యామ్ ఏ డై హార్డ్ ఫ్యాన్ అఫ్ లార్డ్ రామ' అంటూ మరోసారి స్టేట్మెంట్ ఇస్తూపోతున్న రాహుల్ గాంధీ తనలోని కొత్త కోణాన్ని బైటికి తీశారు. అసెంబ్లీ ఎన్నికల సందడి మొదలైనప్పటినుంచీ.. రాహుల్ పోకడ కాస్త విభిన్నంగా వుందని అక్కడి రాజకీయ విశ్లేషణలు చెబుతున్నాయి. ఒకవైపు అన్ని సామాజిక వర్గాలను మచ్చిక చేసుకుంటూ, మంతనాలు నడుపుతూనే, బీజేపీ గట్టిగా నమ్ముకున్న హిందూ ఓటు బ్యాంకుమీద కూడా దెబ్బకొట్టాలన్న ప్లాన్ ని అమల్లో పెట్టేశాడు రాహుల్. గుజరాత్ లో ఇప్పటిదాకా ద్వారకాధీశ్, స్వామినారాయణ్, అంబాజీ, చోటిలా, కోధల్ ధామ్ తదితర 11 దేవాలయాల్ని సందర్శించి.. ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనం అందుకుంటున్న రాహుల్.. తన పార్టీ మీదున్న 'లౌకిక' ముద్రను తాత్కాలికంగా కొద్దికొద్దిగా మరుగునపరిచే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో పేదోడి గుడిసెల్లో  దూరి వాళ్ళిచ్చిన రొట్టెముక్క చప్పరిస్తూ ఆమ్ ఆద్మీ మంత్రం జపించిన రాహుల్.. ఇప్పుడు నేరుగా 'గుడి' బాట పట్టేశారు. 
ఏ గుడికి వెళ్లినా, అత్యంత భక్తిప్రపత్తులతో వ్యవహరిస్తూ ఫోటోలకు ఓపిగ్గా ఫోజులిస్తున్నారు. నుదుట భారీ సైజు తిలకం, భుజం చుట్టూ కాషాయ శాలువాతో.. రాహుల్ ఒక ఆరెస్సెస్ కార్యకర్తలా కనిపిస్తున్నాడంటూ సెటైర్లు కూడా పడుతున్నాయి. ఈసారి అటోఇటో తేల్చుకోవాలని, 'గుజరాత్' పరీక్షలో పాసై మోడీకి ఝలక్ ఇవ్వాల్సిందేనని పట్టుమీదున్న రాహుల్ గాంధీ.. చివరకు 'హిందుత్వ' కార్డును బైటికి తీశాడు. యూపీలో అడ్డం తిరిగిన కథని గుజరాత్ లో సరిచేయాలన్నది రాహుల్ పొలిటికల్ స్కెచ్ కావొచ్చు! ఒకప్పుడు.. ఇండియాను ఇటాలియన్ కళ్ళద్దాలతో చూడొద్దంటూ రాహుల్ మీద సెటైర్లేసిన కమలనాధులు.. ఇప్పుడు అదే రాహుల్ 'సాఫ్ట్ హిందుత్వ' నేచర్ తో ముందుకొచ్చేసరికి షాక్ తిన్నట్టయింది. ప్రధాని మోదీ సొంత గడ్డ మీద రాహుల్ చేస్తున్న విన్యాసాలు సహజంగానే సంఘ్ పరివార్ లో కలకలం సృష్టిస్తున్నాయి. తమ 'హిందుత్వ' వాదాన్ని రాహుల్ గాంధీ హైజాక్ చేస్తున్నారంటూ ఇప్పటికే.. కొందరు బీజేపీయులు బహిరంగంగానే వాపోవడం కొసమెరుపు!
 

Read Also

 
Related News