AP / Politics
జనసేన పుట్టుక రహస్యం అదేనా?

విశాఖపట్నంలో నిర్వహించిన జనసేన పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయకర్తల సమావేశంలో పవన్ చేసిన ప్రసంగం జనానికి కొత్త డౌట్‌ని క్రియేట్ చేసింది. చిన్నవృక్షమే మహావృక్షమవుతుందని.. జనసేన కార్యకర్తలంతా భవిష్యత్‌లో మహావృక్షాలవుతారని పవన్ తన ప్రసంగంలో చెప్పారు. ఇంకా ఏమన్నారంటే..  యువత, మహిళలు ధైర్యంగా ముందుకు రావాలన్నారు. ప్రజలకోసం చివరి వరకూ పోరాటం చేయాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. అందాకా బాగానే ఉంది. మార్పుకోసం చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీని కూకటివేళ్లతో పీకేయాలనుకోవడమే తనకు అత్యంత బాధ కల్గించిందని తెలిపారు. పార్టీ గెలవనందుకు తనకు బాధలేదని..  ఒక మార్పుకోసం వచ్చిన పార్టీకి కొందరు నమ్మకద్రోహం చేసి దాని పతనానికి కారణం కావడం తనను అత్యంత బాధించిందన్నారు.  పోనీ అదీ ఓకేలే అనుకుంటే.. మార్పుకోసం ప్రజల్లోకి వచ్చిన చిరంజీవికి ద్రోహం చేసిన ప్రతీఒక్కరికీ తగిన గుణపాఠం చెబుతానని హెచ్చరికలు జారీచేశారు. ఇక్కడే కథ అడ్డం తిరిగింది.  పార్టీ కార్యకర్తలు పవన్ ప్రసంగానికి అడ్డుపడుతూ పార్టీకి ద్రోహం చేసిన వాళ్లలో పరకాల ప్రభాకర్, పరకాల ప్రభాకర్ అంటూ నినాదాలు చేశారు.

దీనిపై స్పందించిన పవన్, అప్పట్లో పరకాల ప్రభాకర్ పార్టీలో స్వేచ్ఛలేదని విమర్శించారని గుర్తు చేసుకున్నారు. అలాంటి ప్రభాకర్ ప్రజారాజ్యం పార్టీ ఆఫీస్ లోనే ప్రెస్ మీట్ పెట్టిమరీ స్వంత పార్టీమీదే తీవ్ర విమర్శలు చేశారని చెప్పారు. ఒక పార్టీ ఆఫీస్ లో అదే పార్టీని విమర్శించడమంటే అంతకంటే అతనికి స్వేచ్ఛ ఏముంటుందని అన్నారు. పనిలో పనిగా చాలా మంది అప్పట్లో ఇలాగే ప్రవర్తించారని, శేఖర్ కమ్ముల కూడా కామెంట్ చేశారని పవన్ అన్నారు. ఇదిలాఉంటే, పవన్ హెచ్చరికల నేపథ్యంలో ఈ వ్యవహారం మరో టర్న్ తీసుకుంది. 

అసలు పవన్ కళ్యాణ్ లక్ష్యం ఏమిటి? జనసేన పార్టీ పెట్టేందుకు ప్రధాన కారణం ఈ గుణపాఠం చెప్పడమేనా అంటూ డౌట్లు మొదలయ్యాయి.  తన అన్నకు అన్యాయం చేసిన వాళ్లమీద కక్ష తీర్చుకునేందుకు పార్టీ పెట్టారా అనే కామెంట్లకు పవన్ మాటలు ఆస్కారమిస్తున్నాయి. అటు శేఖర్ కమ్ముల మీద పవన్ చేసిన వ్యాఖ్యలు కూడా అభ్యంతరకరంగా ఉన్నాయంటున్నారు విశ్లేషకులు. వివాదాలకు.. అలాంటి ప్రకటనలకు దూరంగా ఉంటారు దర్శకుడు శేఖర్ కమ్ముల. అయితే,  పవన్ గురించి, జనసేన గురించి అతను కామెంట్ చేశారంటే అది పొగడ్తైనా, విమర్శైనా పాజిటివ్ గా తీసుకోవాలి. కాని, పవన్ ఇలా రియాక్ట్ కావడం సరికాదంటున్నారు.

ఒక సారి గతంలోకి వెళ్తే..  హైదరాబాద్ హైటెక్స్ లో జరిగిన జనసేన ప్రారంభ సభలో పవన్ ప్రసంగాన్నివిన్న శేఖర్ కమ్ముల ఆకాశానికెత్తారు. పవన్ మీద ఎంతో నమ్మకాన్ని పెట్టుకున్నారు. అయితే, తర్వాత విశాఖ పట్నంలో నిర్వహించిన జనసేన రెండవ సభలో పవన్ ప్రసంగం విని శేఖర్ కమ్ముల నెగిటివ్ గా రియాక్టయ్యారు.  ఈ విషయాన్నే ఇప్పుడు పవన్ తన తాజా ప్రసంగంలో ప్రస్తావించారు.  పార్టీ కార్యకర్తల మీటింగ్ లో పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలి? ప్రజలకు పార్టీ కార్యకర్తలు ఎలా దగ్గర కావాలనే దానిపై, పార్టీ నేతలకు, స్థానిక శ్రేణులకు దిశానిర్దేశం చేయకుండా  గతించిన ఈ అనవసర టాపిక్స్ ఎత్తుకోవడం ఎందుకనేది కొందరికి అర్థంకాని ప్రశ్నగా మారిపోయింది.   

 

 

 

Read Also

 
Related News