India / General
డ్రెడ్జింగ్ కార్పొరేషన్ అసలు కథ ఇదీ!

నది లేదా సముద్ర తీరాన్ని చదును పరిచే ప్రక్రియనే డ్రెడ్జింగ్ అని వ్యవహరిస్తారు. ఇది ఒకరకమైన తవ్వకం లాంటిదే. కాకపోతే.. ఇది నీటి అంతర్భాగంలో జరిగే తవ్వకం. లోపలున్న ఒండ్రుమట్టి, బురద, నాచు లాంటి వ్యర్థాల్ని ఈ డ్రెడ్జింగ్ ద్వారా తొలగించిన తర్వాత మాత్రమే.. ఆ తీరప్రాంతంలో పోర్ట్ అయినా మరొకటైనా ఎస్టాబ్లిష్ మెంట్ జరిగే ఛాన్సుంది. దేశవ్యాప్తంగా డ్రెడ్జింగ్ పనులకు సంబంధించి విశాఖ కేంద్రంగా 1976లో 'డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా' అనే ప్రభుత్వ
రంగ సంస్థ ఏర్పాటైంది. అప్పట్లో 28 కోట్ల పెట్టుబడితో మొదలైన డీసీఐ.. ఇప్పుడు 6 వేల కోట్ల సైజుకు ఎదిగింది. ఏటా 200 నుంచి 300 కోట్ల మేర రెవెన్యూ రాబడుతోంది(?). 10 వేల మందికి ప్రత్యక్షంగాను, 5 వేల మందికి పరోక్షంగానూ ఉపాధినిస్తోంది. ఇండియన్ నేవీతో పాటు, దేశంలోని అన్ని నౌకాశ్రయాలకు డీసీఐ సర్వీస్ చేస్తోంది.

ఇప్పుడు అకస్మాత్తుగా డీసీఐని ప్రయివేటుపరం చేయాలంటూ కేంద్రం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఏపీ తీరప్రాంతం వెంబడి శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు 10 పోర్టులు నిర్మించాలన్న ప్రతిపాదన ఒకటి సీరియస్ గా వర్కవుట్ అవుతోంది. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు దీనికి సంబంధించి కసరత్తు మొదలుపెట్టేశాయి కూడా. ఈ చర్యల్లో భాగంగానే.. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను వదిలించుకుంటోందా అన్న సందేహాలు వినిపిస్తున్నాయి. ఒకేసారి ఇన్ని పోర్టుల నిర్మాణం తలపెడితే.. వాటికి సంబంధించిన 'డ్రెడ్జింగ్' అనేది ఒక 'భారీ స్థాయి వ్యాపారం'గా మారే అవకాశం వుంది. అందుకే.. ఒక అస్మదీయ కంపెనీకి దీన్ని ధారాదత్తం చేసేందుకు బీజేపీ 'డీల్' కుదుర్చుకుందన్నది ఉద్యోగుల అనుమానం.

అయితే.. డీసీఐ పనితీరు మీద ఎప్పట్నుంచో సందేహాలున్నాయి. సేతు సముద్రం లాంటి ప్రాజెక్టుల్ని సరిగా నిర్వహించలేక చేతులెత్తేసిందని కాగ్ తన నివేదికలో మొట్టికాయలు వేసింది. డ్రెడ్జింగ్ కోసం 100 కోట్లు పెట్టి విదేశాల నుంచి భారీ డ్రిల్లర్ తెప్పిస్తే.. అది మధ్యలోనే రెండు ముక్కలుగా విరిగిపోయి భారీ నష్టాన్ని మిగిల్చిందని ఆరోపణలున్నాయి. సిబ్బంది పనితీరు పేలవంగా ఉందని, రోజురోజుకూ నిర్వహణ వ్యయం పెరిగిపోతోందని యూపీఏ సర్కార్ హయాంలోనే రిపోర్ట్స్ రావడంతో.. డీసీఐ మీద కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే.. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ప్రయివేటీకరణ ఫైల్ టేబుల్ మీదకొచ్చింది. ఇప్పడు మోడీ సర్కారు చెయ్యి పడేసరికి అందులో కదలిక కనిపిస్తోంది. ఇటు.. డీసీఐ ప్రయివేటీకరణతో ఎక్కువగా నష్టపోయేది అక్కడి ఉద్యోగరంగమేనన్న వెర్షన్ కూడా ఒకటుంది.

కోస్టల్ ఇండియాకు జీవనాడి లాంటి డీసీఐ కనుక ప్రయివేటుపరమైతే.. అది జాతి భద్రతకు పెను సవాల్ గా మారుతుందని హెచ్చరిస్తున్నారు. దేశం మొత్తంమీద 320 ప్రభుత్వరంగ సంస్థలు ఉంటే.. వాటిలో 78 మాత్రమే నష్టాలబారిన వున్నాయి. వైట్ ఎలిఫెంట్స్ లాంటి ఈ సిక్ PSUలను వదిలించుకోవడం హేతుబద్ధం కావొచ్చు. కానీ.. ఏటా 200 కోట్లకు పైగా లాభాల్ని గడిస్తున్న డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను ప్రయివేటుపరం చేయడం ఎందుకన్నది ఉద్యోగులు అడుగుతున్న సూటి ప్రశ్న. దీనికి స్థానిక ప్రజాప్రతినిధులు హరిబాబు, అవంతీ శ్రీనివాస్ ఇసుమంతైనా స్పందించకపోవడం వాళ్లలో ఆగ్రహాన్ని పెంచేసింది. ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ ఒక ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడడంతో.. సమస్య తీవ్రతరమైంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగి.. మోదీ సర్కారుకు లేఖ రాశారు.

 

Read Also

 
Related News