India / Politics
శశికళ, రజని, కమల్.. ఒక్క దెబ్బకు మూడు పిట్టలు!
మొన్న మోదీ చెన్నైకి ఎందుకొచ్చారు? వస్తే మాత్రం.. కరుణానిధిని ఎందుకు కలిశారు? కలిస్తే మాత్రం.. స్టాలిన్ తో 20 నిమిషాల సేపు ఏం మాట్లాడారు? ఆ మరునాడే శశికళ ఆస్తుల మీద ఐటీ ఆకస్మిక దాడులు ఎందుకు జరిపినట్లు? ఈ మొత్తం సీక్వెన్స్ కీ ఏదైనా లంకె ఉందా? తమిళనాట ఇప్పుడు కాక రేపుతున్న చర్చ ఇదే! తమిళనాట పొలిటికల్ పిక్చర్ పూర్తిగా మారిపొయ్యే సంకేతాలున్నాయన్న వాదన కూడా పుట్టేసింది. 
 
జయలలిత మరణం తర్వాత జరిగిన మార్పుల కంటే వేగంగా.. రాబోయే మూడు నెలల్లో తమిళనాట మరిన్ని రాజకీయ సంచలనాలు చోటుచేసుకునే సూచనలున్నాయన్నది ఒక అంచనా. చీలికలు పేలికలైన అన్నాడీఎంకేతో ఒరిగేది ఏమీ లేదన్న స్పష్టత మీదే.. మోదీ కరుణానిధిని దువ్వుతున్నారని, రాబోయే జనరల్ ఎలక్షన్స్ లో డీఎంకేతో కలిసి నడవాలన్నదే బీజేపీ స్ట్రాటజీ అని ఢిల్లీ వేగులు చెబుతున్న మాట. ఇంకా అంతోఇంతో మిగిలున్న అన్నాడీఎంకే బేస్ ని నిర్మూలిస్తేనే.. తమిళనాట డీఎంకే మరింత బలపడేది. కరుణ కనుసైగ తర్వాతే.. ఐటీ శాఖకు మోదీ నుంచి ఆదేశాలొచ్చాయని, శశికళ ఆర్ధిక మూలాల్ని తెగ్గొట్టాలన్న మొదటి లక్ష్యం ఈవిధంగా నెరవేరిందని చెబుతున్నారు. జయ సమాధి మీద కొట్టిమరీ శపథం చేసిన శశికళ 'కథ'ను పరిసమాప్తం చేయడం కూడా శత్రుపక్షాలకు అవసరం!
 
ఇదిలా ఉంటే.. డిసెంబర్ 5న 2జీ కుంభకోణం కేసులో కీలక తీర్పు వెలువడనుంది. మాజీ మంత్రి ఏ రాజా, కనిమొళి ప్రమేయం వున్న ఈ కేసు తీర్పు డీఎంకే ప్రతిష్టను ప్రభావితం చేసే అవకాశం వుంది. ఈ క్రమంలోనే.. ఐదవ తేదీ చెన్నైలో జరిగిన కరుణ-మోదీ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. పైగా.. తమిళనాట రజనీ, కమల్ సొంత కుంపట్లు పెట్టుకుంటున్నారు. మరి.. అరవగడ్డ మీద బీజేపీ భవిష్యత్తును వెతుక్కోవద్దా? డీఎంకేకి ఒక అండ-దండ అవసరం ఉండదా?
 

Read Also

 
Related News