AP / Politics
అఖిలప్రియ రాజీనామా.. చంద్రబాబు ఆమోదిస్తారా?
అయినా పడవప్రయాణం..! రెండుపదుల మంది ప్రాణాల్ని తీసిన ఈ విషాదానికి అంతు లేదు! నిర్లక్ష్యం ఎటువైపుందన్న లెక్కలు తర్వాత్తర్వాత తేలిపోవచ్చు. తేలకపోనూవచ్చు. కానీ..ప్రజలప్రాణాలకు కాపుకాయాల్సిన యంత్రాంగం, దాన్ని పద్ధతిగా నడిపించాల్సిన ప్రభుత్వం మాత్రం తొలిముద్దాయిగా నిలబడాల్సిందే! స్పష్టమైన నిర్వహణా లోపాలున్నట్లు ప్రాధమిక విచారణలోనే తేలిపోతున్న క్రమంలో.. ఏపీ సర్కార్ 'డిఫెన్స్'లో పడిన మాట వాస్తవం. 
కొత్తగా కొలువునెక్కిన మంత్రి అఖిలప్రియకు ఇది ఖచ్చితంగా అగ్నిపరీక్షే! మొదటిసారి ఎమ్మెల్యేగా నెగ్గిన అమ్మాయికి క్యాబినెట్లో చోటు కల్పించడం ఏమిటంటూ ఆమె ఎంట్రీ సమయంలోనే విమర్శలు పడ్డాయి. ఇప్పుడు.. తన శాఖ పరిధిలో జరిగిన ఈ 'పెను ప్రమాదం' ఆమె పొలిటికల్ కరియర్ ని ఎటువైపు మళ్లిస్తుందన్నది చర్చనీయాంశంగా మారింది. ఘటన జరిగిన వెంటనే చురుగ్గా స్పందించినప్పటికీ పొంతన లేని వివరణలిస్తోందంటూ ఇప్పటికే ఆమె మీద సూటిపోటి విమర్శలు పడిపోతున్నాయి. 'డామేజ్ కంట్రోల్' చేసుకోవాల్సిన భారమైతే ప్రభుత్వ అధినేత చంద్రబాబు మీదే వుంది. అనుభవం లేదన్న కారణంతోనో..  ప్రొబేషనరీ పీరియడే కదా అన్న ఉదాసీనతతోనో అఖిలప్రియను ఉపేక్షిస్తారా? లేక.. 'చర్య'లకు ఉపక్రమిస్తారా? అనే చర్చ ప్రభుత్వ వర్గాల్లో మొదలైంది. 
 
ఒకప్పుడు టెన్త్ పేపర్ లీకయిందని ఎన్టీయార్ క్యాబినెట్లో ముద్దుకృష్ణమ నాయుడు, మొన్నీమధ్యే వరుస రైలు ప్రమాదాలతో కలత చెంది మోదీ క్యాబినెట్లో సురేష్ ప్రభు రాజీనామా రాసిచ్చి తమ నైతికతను రుజువుచేసుకున్నారు. అంతకుముందు లాల్ బహదూర్ శాస్త్రి కూడా నెహ్రు క్యాబినెట్ నుంచి ఇలానే తప్పుకుని చరిత్రకెక్కారు. ఇప్పుడిప్పుడే రాజకీయంలో గట్టిపడుతున్న అఖిలప్రియ కూడా 'నైతిక బాధ్యత' అనే ఎక్స్ పరిమెంట్ ను తలకెత్తుకుంటుందా? ఒకవేళ ఆమెకు ఇటువంటి ఆలోచన ఉంటే.. చంద్రబాబు ప్రోత్సహిస్తారా? అనేది కూడా కీలకమే. తమ పార్టీ గుర్తు మీద గెలిచి అధికార పార్టీలో చేరి మంత్రిగా చెలామణీ అవుతోందన్న వైసీపీ విమర్శలకు సైతం చెక్ పెట్టే సువర్ణావకాశం కూడా ఇదే! మరి.. 'విషాద సంగమం' నేపథ్యంలో అఖిలప్రియ అడుగులు ఎటు..? చంద్రబాబు ఆలోచన ఏమిటి?
 

Read Also

 
Related News