AP and TS / Entertainment
మూడు నందులు.. ఆరు గొడవలు..!
నందమూరి కుటుంబంలో ఆల్ హ్యాపీస్! ఉత్తమ నటులుగా ఎంపికైన బాబాయ్, అబ్బాయ్ ఎన్టీయార్ పేరు నిలబెట్టారంటూ.. ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.  2014 సంవత్సరానికి ఉత్తమ నటుడిగా బాలకృష్ణ (లెజెండ్), 2016సంవత్సరానికి జూనియర్ ఎన్టీఆర్ (నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్) ఎంపికయ్యారు. ప్రకటన వెలువడ్డ వెంటనే..  ''నందమూరి కుటుంబానికి ఇదొక గర్వించదగ్గ తరుణం'' అంటూ కళ్యాణ్ రామ్ ట్విట్టర్లో పోస్ట్ పెట్టి తన ఆనందాన్ని వ్యక్తం చేసుకున్నారు. అటు.. హరికృష్ణ మనవళ్ళు (జానకీరామ్ కొడుకులు) దానవీర శూర కర్ణ మూవీకి సంబంధించి బెస్ట్ చిల్డ్రన్ ఆర్టిస్టులుగా ఎంపికయ్యారు. 
 
'శ్రీమంతుడు' సినిమాలో మహేష్ బాబు నటనకు ఫ్లాట్ అయిన జ్యురీ మెంబర్స్.. 2015 సంవత్సరానికి గాను.. ఉత్తమ నటుడుగా ఫిక్స్ చేశారు. 'వన్-నేనొక్కడినే' మూవీలో మహేష్ చిన్ననాటి రోల్ చేసిన ప్రిన్స్ కొడుకు గౌతమ్ బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంపికయ్యాడు. మొత్తానికి ఘట్టమనేని ఫ్యామిలీ కూడా ఫుల్ ఖుషీనే! బాహుబలి ఫేమ్ రాజమౌళికైతే మంచి గౌరవమే దక్కింది. ఆయన ఖాతాలో రెండు నందులు పడ్డాయి. 2014 సంవత్సరానికి బీఎన్ రెడ్డి జాతీయ అవార్డునందుకోనున్నారు టాలీవుడ్ జక్కన్న. అటు.. తన ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ 'బాహుబలి' 2015 సంవత్సరానికి గాను ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. 
 
అక్కినేని ఫ్యామిలీకి అన్యాయం జరిగిందంటూ సోషల్ మీడియాలో సానుభూతి వ్యాఖ్యలు కనిపించాయి. మూడు తరాల కథానాయకులతో, వినూత్న కథనంతో  ప్రయోగాత్మకంగా తీసిన 'మనం' మూవీ కేవలం ద్వితీయ ఉత్తమ చిత్రంగా నిలవడం.. నాగ్ కి ఇబ్బంది కలిగించే అంశమే! ఇక.. మెగా క్యాంప్ లో కూడా ఒకింత నిరాశావాతావరణమే! చిరంజీవికి దక్కిన రఘుపతి వెంకయ్య స్మారక పురస్కారం తప్పితే.. మెగా ఫ్యామిలీలో మరే హీరోకూ సరైన న్యాయం జరగలేదంటూ నిట్టూర్పులు వినిపించాయి. రుద్రమదేవి మూవీలో 'బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్'గా మెరిసిన అల్లు అర్జున్ తప్పితే మరెక్కడా 'మెగా'వాసన లేనేలేదు. 
 
మొత్తమ్మీద.. నందమూరి, బోయపాటి, రాజమౌళి.. ఇలా అమరావతి నందుల సందడిలో 'పసుపుదనం' ఎక్కువైందని చమక్కులు పడ్డాయి. అధికార పార్టీ తెలుగుదేశానికి, సీఎం చంద్రబాబుకు దగ్గరగా మెలిగే పర్సనాలిటీలకు మాత్రమే ప్రయారిటీలు దక్కినట్లు ఎవరికివారు విశ్లేషించుకుంటున్నారు. 
 

Read Also

 
Related News