Telangana / Politics
కొత్త పార్టీ ఆలోచ‌న‌లో కోమ‌టిరెడ్డి

తెలంగాణాలో మ‌రో పార్టీకి రంగం సిద్ధమ‌వుతోంది. ఎప్పటినుంచో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మీద అస‌హ‌నంతోవున్న మాజీమంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ పార్టీ రాబోతోంది. అయితే కాంగ్రెస్ నుంచి వీడిపోయినా అదే కాంగ్రెస్ పేరు క‌లిసి వ‌చ్చేలా ‘తెలంగాణా కాంగ్రెస్’ పేరుతో ఓ కొత్త పార్టీ పెట్టాల‌ని ఆయ‌న ఆలోచిస్తున్నట్టు స‌న్నిహితుల నుంచి అందుతున్న స‌మాచారం. ఈ పార్టీని ఎన్నిక‌ల వ‌ర‌కూ న‌డిపితే అప్పుడు అవ‌స‌ర‌మ‌తే కాంగ్రెస్‌తోనో లేక టీఆర్ఎస్‌తోనో లేక మ‌రే ఇత‌ర పార్టీతోనో పొత్తు పెట్టుకోవ‌చ్చన్నది కోమ‌టిరెడ్డి ఆలోచ‌నట‌.

ఈ పార్టీ ద్వారా త‌న ఉనికిని చాటుకోవ‌డంతోపాటు త‌న‌తో క‌లిసొచ్చే మ‌రో ప‌దిమందికి కూడా టిక్కెట్టు ఇప్పించుకోవ‌చ్చన్నది కోమ‌టిరెడ్డి ఆలోచ‌న‌గా ఆయ‌న స‌న్నిహితులు చెబుతున్నారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని తొల‌గించి పీసీసీ పీఠం త‌న‌కు ఇవ్వాల‌ని కోమ‌టిరెడ్డి ఎప్పటి నుండో డిమాండ్ చేస్తున్నా.. కాంగ్రెస్ హైక‌మాండ్ ఆయ‌న మాట‌ల్ని ప‌ట్టించుకోవ‌డంలేదు. దీంతోపాటు రేవంత్ చేరిక‌, విజ‌య‌శాంతికి త్వర‌లోనే కీల‌క బాధ్యత‌లు అప్పగించే ఆలోచ‌న‌లాంటి వార్తలు కోమ‌టిరెడ్డి అస‌హ‌నాన్ని మ‌రింత పెంచుతున్నాయి. వీట‌న్నింటికీ ప‌రిష్కారం సొంత పార్టీయే అన్నది కోమ‌టిరెడ్డి వాద‌న‌.

 

Read Also

 
Related News