India / Politics
కేజ్రీవాల్ యు-టర్న్, ఢిల్లీ 'సరి-బేసి' రద్దు!

'సరి-బేసి' కార్ల ట్రాఫిక్ విధానంపై కేజ్రీవాల్ సర్కార్ వెనక్కు తగ్గింది. ఢిల్లీలో వాయు కాలుష్య నియంత్రణ కోసం ఈనెల 13 నుంచి 17 వరకు అమలు చేయాలనుకున్న ఈ ప్లాన్ ని ఢిల్లీ రవాణా శాఖ రద్దు చేసుకుంది. అంబులెన్స్, అగ్నిమాపక వాహనాలకు తప్పిస్తే మరెవ్వరికీ మినహాయింపునివ్వరాదంటూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ షరతులు పెట్టడంతో ఢిల్లీ ప్రభుత్వం అత్యవసర క్యాబినెట్ మీటింగ్ ఏర్పాటు చేసి.. ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

దేశ రాజధాని నగరం కనుక వీఐపీలకు మినహాయింపు ఉండాల్సిందేనని ఢిల్లీ ట్రాన్స్ పోర్ట్ మినిస్టర్ కైలాష్ గెహ్లాట్ వాదిస్తున్నారు. 30 లక్షల టూవీలర్స్ రోడ్డు మీదకు రాకపోతే.. అంతమందికి పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ఏర్పాటు చేయడం తమవల్ల కాదన్నది కూడా ఆయన అభ్యంతరం. గ్రీన్ ట్రిబ్యునల్ లో మళ్ళీ పిటిషన్ వేస్తామని, తుది తీర్పు వచ్చేవరకు 'సరి-బేసి- కార్ల విధానం' జోలికి వెళ్లబోమని కేజ్రీవాల్ సర్కార్ స్పష్టం చేసింది. దీంతో ఢిల్లీ జనాభాకు ఊరట దొరికింది. కానీ ఎయిర్ పొల్యూషన్ సమస్య నివారణ కోసం చేపట్టే ప్రతీ చర్యకూ ఇలా అడ్డంకులు ఏర్పడడం దురదృష్టకరం.

 

Read Also

 
Related News