India / Politics
ఆరునూరైనా ఆర్కే నగర్ నాదే.. విశాల్ రెడ్డి కొత్త స్కెచ్!
విశాల్ రెడ్డికి కాలింది.. ఇప్పుడేం చేస్తాడు.. అంటూ ఆసక్తిగా ఎదురుచూస్తోంది తమిళనాట ప్రజానీకం. అటు కోలీవుడ్ సైతం.. విశాల్ నెక్స్ట్ స్టెప్ ఏమిటన్న దానిపై విపరీతంగా చర్చించుకుంటోంది. తమిళ్ ఇండస్ట్రీలో పరమ మొండోడిగా పేరున్న విశాల్.. అనుకున్నది సాధించుకోడానికి ఎంతకైనా తెగిస్తాడు. చిన్న వయసులోనే పెద్దపెద్ద తలకాయలతో పోటీపడి పరిశ్రమకు చెందిన రెండు కీలక పదవుల్ని సొంతం చేసుకున్నాడు. సినిమా ఆర్టిస్టుల్లో ఎవరికి కష్టమొచ్చినా ముందొచ్చి నిలబడే విశాల్.. ప్రజా సమస్యల మీద కూడా అంతే జోరు చూపించేవాడు. ఇప్పుడు రాజకీయాల మీద యావ పుట్టి.. ఆర్కే నగర్ ఉపఎన్నికలో చెయ్యి పెట్టేశాడు. కానీ.. ఇక్కడ విశాల్ కథ అడ్డం తిరిగింది. అసలే మోనార్క్ లాంటోడు. ఇప్పుడు మళ్ళీ మంటెక్కి పొయ్యాడు. నామినేషన్ తిరస్కరణతో అహం దెబ్బతిన్న విశాల్.. వెనకడుగు వెయ్యబోడన్నది క్లియర్. తన వెనుక కుట్ర జరిగిందని, కోర్టులో తేల్చుకుంటానని శపథం కూడా చేశాడు. కానీ.. అక్కడితోనే ఆగుతాడా?
''అప్పుడు అమ్మ చనిపోయింది.. ఇప్పుడు ప్రజాస్వామ్యం చచ్చిపోయింది..'' అంటూ కసిగా ట్వీట్ చేసిన విశాల్.. వ్యక్తిగతంగా తాను ఏ పార్టీ వైపున్నాడన్న సంకేతాల్ని కూడా ఇచ్చేశాడు. నామినేషన్ వేయడానికి ముందు ఎంజీఆర్ ఇంటికి వెళ్లి ఫొటోకు దండేశారు. ఏదేమైనా ప్రతిపక్ష డీఎంకేని నష్టపర్చాలన్న ఉద్దేశంతోనే విశాల్ అడుగులేస్తున్నట్లు తమిళ రాజకీయాల్లో విశ్లేషణలొచ్చాయి. ఇప్పుడీ కుర్రాడి నామినేషన్ చింపివేతకు గురవడంతో.. 'పీడా' విరగడైందని కొన్ని శక్తులు ఊపిరి పీల్చుకుంటున్నాయట. కానీ.. విశాల్ రెడ్డి ఆర్కే నగర్ ని అంత ఈజీగా వదిలిపెట్టకూడదన్న కమిట్మెంట్ తో  ఉన్నట్లు తెలుస్తోంది. బరిలో నిలిచిన ఇండిపెండెంట్ అభ్యర్థుల మీద ఓ కన్నేసి ఉంచిన ఈ 'పందెం కోడి'  తన భావాలతో ఏకీభవించే ఒక చాకులాంటి కుర్రాడ్ని ఎంపిక చేసుకుని అతడికి మద్దతుగా ప్రచారం చేసే యోచనలో వున్నాడు. ఆవిధంగా.. తన సత్తా ఏమిటన్నది తమిళ రాజకీయ వర్గాలకు చాటాలన్నది ఈ మొండోడి ఎత్తుగడ. ఆర్కే నగర్లో పోటీకి ఆసక్తి కనబరుస్తూ 131 మంది నామినేషన్ వేశారు. నలుగురైదుగురు పార్టీ క్యాండిడేట్లు పోనూ మిగతావారంతా ఇండిపెండెంట్ అభ్యర్ధులే. వీళ్ళలో విశాల్ గుడ్ లుక్స్ లో పడే ఆ అదృష్టవంతుడెవ్వడో మరి! 
 

Read Also

 
Related News