India / Politics
గుజరాత్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా అహ్మద్ పటేల్!
కురుక్షేత్రాన్ని తలపిస్తున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల బిగ్ ఫైట్ రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. బీజేపీకి పెట్టని కోటగా పేరున్న గుజరాత్ లో ఈసారి ఎలాగైనా పాగా వేయాలని కాంగ్రెస్ పార్టీ పట్టుదల మీదుంది. బీజేపీ కూడా మోదీ కరిష్మాకు గుజరాత్ ఎన్నికల్ని గ్రాండ్ శాంపిల్ గా తీసుకుంది. ఈ క్రమంలో.. ఒక్కో అడుగూ ఆచితూచి వేస్తున్నాయి రెండు ప్రధాన పార్టీలు. చివరకు ముఖ్యమంత్రి అభ్యర్థులెవరన్నది కూడా అనౌన్స్ చేయకుండా జాగ్రత్త వహిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ, సీనియర్ నేత అహ్మద్ పటేల్ ని సీఎం క్యాండిడేట్ గా ప్రకటించినట్లు ఒక పుకారు హల్ చల్ చేస్తోంది. ''ముస్లిం ఓటర్లారా.. కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి.. అహ్మద్ పటేల్ ని సీఎంని చేసుకుందాం'' అంటూ ఫ్లెక్సీలు కూడా వెలిశాయి. అయితే.. ఈ ప్రచారంతో పార్టీకి సంబంధం లేదని, అహ్మద్ పటేల్ ఎంపిక మీద ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదని గుజరాత్ కాంగ్రెస్ స్పష్టం చేస్తోంది. ఒకవైపు హిందుత్వ ఓటు బ్యాంకు కోసం రాహుల్ గాంధీ తెగ తిరిగేస్తుంటే.. అహ్మద్ పటేల్ ని సీన్లోకి తీసుకొచ్చి పార్టీని నష్టపర్చాలన్న కుట్ర జరుగుతోందని కూడా కాంగ్రెస్ అనుమానిస్తోంది. ఒకవేళ.. కాంగ్రెస్ పార్టీకి గుజరాత్ లో పవర్ వస్తే.. అహ్మద్ పటేల్ పేరు పరిశీలనకు తీసుకోవచ్చన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. సోనియాగాంధీ రాజకీయ సలహాదారుగా అహ్మద్ పటేల్ కి కాంగ్రెస్ పార్టీలో మంచి పట్టుంది కూడా!  
 

Read Also

 
Related News