AP / Politics
చంద్రబాబుకి మిగిలిందేంటి?
ఏపీకి స్పెషల్ స్టేటస్, రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్ట్..! సీఎం కుర్చీనెక్కిన తర్వాత చంద్రబాబు చేతికొచ్చిన మూడు బృహత్తర బాధ్యతలు ఇవే. వాటి విషయంలో వీలైనంత ఎక్కువ ప్రోగ్రెస్ చూపించడం ద్వారా.. 2019 ఎన్నికల్లో లబ్ది పొందాలన్నది ఆయన స్ట్రాటజీ! కానీ.. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఒక్కటొక్కటిగా ఈ మూడూ బాబు చేతిలోంచి జారిపోతుండడం! స్పెషల్ స్టేటస్ కోసం ఏడాదిన్నర పాటు చేసిన కసరత్తు మొత్తం వృధా అయిపోయింది. అది కాస్తా స్పెషల్ ప్యాకేజ్ గా మారి.. ఇప్పుడా స్పెషల్ ప్యాకేజ్ మీద కూడా స్పెషల్ క్వశ్చన్ మార్క్ పడిపోయింది. ఇక రాజధాని అమరావతి నిర్మాణం..! మూడున్నరేళ్లు దాటినా ఇప్పటికీ నమూనాల దగ్గరే ఆగిపోయింది అమరావతి. తాత్కాలిక భవనాల్లో కొలువుతీరిన అసెంబ్లీ, సచివాలయాలు తప్ప అమరావతిలో ఇప్పటివరకూ శాశ్వత ప్రాతిపదికన ఏదీ నిర్మితం కాలేదు. 
మూడోది పోలవరం. ప్రాజెక్ట్ సైట్ దగ్గర కుర్చీనేసుకునిమరీ రేయింబవళ్లు కాపు కాస్తానని, అటు సూర్యుడు ఇటు పొడిచినా 2019లోగా పోలవరం పూర్తి చేస్తానని శపథం చేసిన చంద్రబాబు.. మొన్న అసెంబ్లీలో పూర్తిగా చేతులెత్తేశారు. మీరే తీసుకోండి. మీరే పూర్తి చేయండి.. అంటూ కేంద్ర ప్రభుత్వం మీద అలిగినప్పుడు ముఖ్యమంత్రి దగ్గర వందశాతం నిస్తేజమే కనిపించింది. పోలవరం అనేది ఒక గుదిబండ అన్న వాస్తవాన్ని గ్రహించారని, ఆ బాధ్యతను వదిలించుకోవాలన్నదే ఆయన అభిమతమని తెలుగుదేశం శ్రేణులే చెప్పుకుంటున్న పరిస్థితి. అటు చంద్రబాబు కాడి దించేశారు.. ఇటు కేంద్ర ప్రభుత్వమూ ఎటూ తేల్చకుండానే నెలలు గడిచిపోతాయి. ఈలెక్కన పోలవరం ప్రాజెక్ట్ మళ్ళీ మూలనపడ్డం ఖాయం! 
 
నిజానికి ఈ మూడూ విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీలు. తీర్చాల్సింది కూడా ఆ కేంద్రమే. కేంద్రంలో హామీలిచ్చినప్పుడున్న ప్రభుత్వం ఇప్పుడు లేదు. కాకపోతే.. ఈ మూడింటిమీద గట్టిగా డిమాండ్ చేసిన బీజేపీ ప్రభుత్వంలోకొచ్చింది. ఈ డిమాండ్లను తీర్చాల్సిన పూర్తి బాధ్యత లేనట్లే.. తూచ్ అనగలిగే ధైర్యం కూడా లేదు బీజేపీకి. చట్టంలో రాయలేదని, ప్లానింగ్ కమిషన్ రద్దయిందని చెప్పి స్పెషల్ స్టేటస్ విషయంలో తెలివిగా తప్పించుకున్న ఎన్డీఏ సర్కార్.. పోలవరం ప్రాజెక్టును, అమరావతి నిర్మాణానికివ్వాల్సిన నిధుల్నీ కూడా అటకెక్కించడం ఖాయం. ఈ లెక్కన ఇవ్వాళ్టిరోజున చంద్రబాబు చేతిలో మిగిలిందేమైనా ఉందా?. ఎన్నికల దాకా ఖాళీయేనా? అప్పుడప్పుడూ జరిగే ఫారిన్ టూర్లు తప్ప!
 

Read Also

 
Related News